నిజామాబాద్: అక్కడక్కడా చిన్నచిన్న లోపాలను సరిదిద్దుకుంటే తెలంగాణలోని ప్రతి పల్లెకు ఉత్తమ గ్రామాల జాబితాలో స్థానం దక్కుతూ అవార్డుల పంట పండుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం ఆయన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారులతో పల్లె ప్రగతి కార్యక్రమంపై నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ, గ్రామాల్లో సదుపాయాల కల్పనను మెరుగుపరుస్తూ.. ప్రజోపయోగ పనులు చేపట్టేందుకు నిధుల కొరత ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తూ రాష్ట్రంలోని మొత్తం 12,700 గ్రామాల్లో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, క్రీడా ప్రాంగణాలు తదితర పనులన్నీ పూర్తిచేసిందని, కొత్తగా నిధుల అవసరం అంతగా లేదన్నారు.
తెలంగాణసర్కారు దార్శనిక పాలన ఫలితంగా తెలంగాణలోని అన్ని పల్లెలు ఉత్తమ గ్రామాల జాబితాలో అవార్డులు సాధిస్తాయని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రధానంగా ప్రతి గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ..నీటి సరఫరా, విద్యుత్ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎఏవోలు దగ్గరుండి పనులు జరిపించుకోవాలని, ఏవైనా లోపాలు ఉంటే తక్షణమే సరి చేసుకోవాలని సూచించారు. పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లాంటి సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల వారికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తున్నామనే వివరాలను ఫ్లెక్సీ పై రాయించి, ప్రతి గ్రామంలో ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు.
పల్లె ప్రకృతి కార్యక్రమంలో చేపట్టిన పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకపై తాను ప్రతి రెండు నెలలకు ఒకసారి జిల్లా వారీగా సమీక్ష నిర్వహిస్తానని, అన్ని లోపాలు చక్కదిద్దుకోవాలని సూచించారు. ఆయా పనుల ప్రగతి సాధన కోసం చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్లతోపాటు అధికారులకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.