వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని రాయపర్తి మండలం ఊకల్ గ్రామం ఎస్సీ కాలనీలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దాదాపు అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. కొన్ని చోట్ల భూములు అందుబాటులో లేకపోవడం వల్ల సాధ్యం కాలేదన్నారు. మరికొన్ని చోట్ల దొరికిన భూముల్లో ఆలస్యంగా మొదలు పెడుతున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ పేద ప్రజల ఆత్మగౌరవం పెరిగే విధంగా డబుల్ ఇండ్లు నిర్మిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిజమైన అర్హులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే దళిత బంధును అర్హులైన నిరుపేదలకు ముందుగా అందేట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.