హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ భవనాల నిర్మాణం, మరమ్మతు పనులను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. ఈ పనులను డిసెంబర్ నెలాఖరునాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్ణయించారు. 485 కొత్త సబ్ సెంటర్ల నిర్మాణం, 206 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మరమ్మతులు, 43 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కొత్త భవనాల నిర్మాణం చేపట్టడానికి రూ.203 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. భవనాల నిర్మాణం, మరమ్మతులకు అవసరమైన టెండర్లను వెంటనే పూర్తి చేసి, డిసెంబర్‌నాటికి పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలు, మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు నిర్ణీత సమయంలో ఆయా పనులు పూర్తికావడం కోసమే వీటిని పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఇందులో భాగంగా మంగళవారం మంత్రి ఎర్రబెల్లి.. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఇంజినీరింగ్ అధికారులతో మంత్రుల నివాసంలోని తన ఇంటి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒకో కొత్త భవనానికి రూ.1.5 కోట్లు, ఒకో సబ్ సెంటర్ నిర్మాణానికి రూ.20 లక్షల చొప్పున కేటాయించినట్టు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో మిగిలినవాటిని ఈ విధంగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఆయా పనులను గడువులోగా పూర్తి చేయగలిగే కాంట్రాక్టర్లకు మాత్రమే అప్పగించాలని ఆదేశించారు. ఈ నెల 9వ తేదీలోగా టెండర్లు పూర్తి చేసి, డిసెంబర్‌లోగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు చెప్పారు. సమావేశంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ హన్మంతరావు, పంచాయతీరాజ్ ఈఎన్సీ సంజీవరావు, ఎస్ఈలు, డీఎం అండ్ హెచ్‌వోలు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి: ఎంపీటీసీల ఫోరం వినతి
తమ సమస్యలను పరిష్కరించాలని ఎంపీటీసీల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు పంచాయత్‌రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసంలో ఫోరం నాయకులు మంత్రి కలిశారు. ప్రతి ఎంపీటీసీకి అభివృద్ధి పనుల కోసం ఏటా రూ.20 లక్షలు మంజూరు చేయాలని, గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ కల్పించాలని, కార్యాలయంలో ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో హామీ ఇచ్చిన రూ.250 కోట్లను వెంటనే మంజూరు చేయించాలని విజ్ఞప్తిచేశారు. స్పందించిన మంత్రి.. సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కార్యదర్శి దేవి రవీందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే యాకయ్య, కోశాధికారి మన్నె రాజు తదితరులు ఉన్నారు.