జనగామ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బంజరు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జనగామలోని ధర్మ కంచలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా జిల్లా ప్రజలను ద్దేశించి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ మానసపుత్రిక పల్లె ప్రగతి (Palle Pragathi) అద్భుత పథకంగా పేరు గాంచిందని అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి అనేక జాతీయ అవార్డులు, రివార్డులు వచ్చాయని వెల్లడించారు. పదేళ్ల కాలంలో అన్ని రంగాల్లో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది. దేశంలో ఎక్కడాలేనన్ని వినూత్న విశేష పథకాల అమలుతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం, వివక్ష వల్ల వ్యవసాయం దండుగలా ఉండేదని, తెలంగాణ వచ్చాక పండగలా అయిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) , ఎస్సారెస్సీ కాలువలు, దేవాదుల (Devadula) ప్రాజెక్టుతో చివరి ఆయకట్టుకు సాగునీరు వచ్చిందని తెలిపారు. కరువు, కాటకాలతో ఉండే జనగామ ప్రాంతం నేడు సాగునీటితో సస్యశ్యామలం అయిందని అన్నారు.
రైతులకే తొలి ప్రాధాన్యం
అన్నం పెట్టె రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. రైతు బంధు, నాణ్యమైన ఉచిత విద్యుత్ (Free Power) , రైతు రుణమాఫీ, రైతు బీమా, చెరువుల పునరుద్ధరణ, భారీ సాగు నీటి ప్రాజెక్టులు, నాణ్యమైన విత్తనాల సరఫరా, పంట కొనుగోలు, రైతు వేదికలు, ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం, తదితర కార్యక్రమాలు, పథకాలతో రైతులలో సేద్యం పట్ల విశ్వాసాన్ని పునరిద్దారించారని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో బంజరు భూముల్లోనూ బంగారు పంటలు పండుతున్నాయని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ జిల్లాలో 77 వేల 262 ఎకరాల వరకు సాగు నీరు అందగా తెలంగాణ వచ్చిన తరువాత 4 లక్షల 51 వేల 778 ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.
రైతు బంధు
జనగామ జిల్లాలో పంటల పెట్టుబడి సహాయం కింద 2018 వానాకాలం నుంచి 2023 వానాకాలం వరకు లకఞా 68 వేల 678 మంది రైతులకు రూ. 1,917 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని వివరించారు. రైతు బీమా ద్వారా 2 ,512 మంది రైతులకు రూ. 125 . 60 కోట్లు మరణించిన రైతు కుటుంబాలకు అందించామని అన్నారు.
మెడికల్ కాలేజీ (Medical College)
జిల్లాకు నూతనంగా మెడికల్ కాలేజీ ఏర్పాటు ఓ చరిత్ర అని మంత్రి పేర్కొన్నారు. 23 ఎకరాల 10 గుంటల ప్రభుత్వ భూమిని మెడికల్ కాలేజీకి మంజూరు అయ్యిందన్నారు. ఈ విద్యా సంవత్సవరం నుంచే 100 ఎంబీబీఎస్ సీట్లను, 115 మంది స్పెషల్ డాక్టర్లను కేటాయించిన సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ పాకాల సంపత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోగల జమున లింగయ్య, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.