జనగామ: రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయనని మొండికేస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayaker rao) విమర్శించారు. దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పించాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. జిల్లాలోని పాలకుర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. రైతు రాజు కావాలని సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో అనేక పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. అయితే రాష్ట్ర వైఖరికి భిన్నంగా కేంద్రం పద్ధతి ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రైతేడ్చిన రాజ్యం, గొడ్డు ఏడ్చిన వ్యవసాయం బాగు పడదని ముఖ్యమంత్రి నమ్ముతారని, అందుకే కరోనా కష్టకాలంలో కూడా రైతుల పంటను మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. టోకెన్ పద్ధతిలో ధాన్యం కొనుగోలును నిర్వహించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే కేంద్రంతో ధాన్యం కొనుగోలుపై ఒక స్పష్టమైన వైఖరిని ప్రకటింపచేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆందోళనకు గురిచేయడం కాంగ్రెస్, బీజేపీలకు అలవాటు అయిపోయిందన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకోకుండా.. రైతులకు, ప్రజలకు మేలు చేయడానికి ముందుకు రావాలని సూచించారు.