Jaahnavi Kandula : పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా అమెరికాలో మరణించిన జాహ్నవి కందుల కుటుంబానికి అమెరికా ప్రభుత్వం రూ.262 కోట్ల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరిహారంపై జాహ్నవి తల్లి విజయ లక్ష్మి స్పందించారు. ఆ డబ్బుతో ఏం చేసుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ పరిహారంతో మాకు కొంత మేలు జరుగుతుందని అనుకోవచ్చు. ఈ డబ్బుతో మేమేం చేసుకోవాలి. యాక్సిడెంట్ చేసి జాహ్నవి మరణానికి కారణమైన పోలీసు అధికారికి ఎప్పటికీ శిక్ష పడదు.
జాహ్నవి మరణంపై జోక్ చేసి, ఆమె ప్రాణానికి విలువ లేదని చెప్పిన మరో ఆఫీసర్ సంగతేంటి..?’’ అని విజయ లక్ష్మి వ్యాఖ్యానించారు. జాహ్నవి తండ్రి శ్రీకాంత్ ఈ పరిహారం ప్రకటించడానికి రెండు రోజుల ముందే గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు. కూతురు మరణంతో లాంగ్ లీవ్ పెట్టిన ఆయన ఇటీవలే విధుల్లో చేరారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కన్నుమూశారు. జాహ్నవికి పరిహారం ప్రకటనపై సియాటెల్ ప్రభుత్వం ఆమె కుటుంబానికి సమాచారం అందించింది. వచ్చే నెలలో అమెరికా రావాలని సూచించింది. పరిహారం ప్రకటన సందర్భంగా అక్కడి అధికారులు జాహ్నవి మరణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సియాటెల్ సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం మాట్లాడుతూ.. జాహ్నవి మరణం బాధాకరమని, అయితే, ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి, సన్నిహితులకు కాస్తయినా ఉపశమనం లభిస్తుందన్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జాహ్నవి అమెరికాలోని సియాటెల్‌లో చదువుతుండేది. అక్కడ 2021, జనవరి 23న రాత్రి రోడ్డు దాటుతున్న సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది. దీంతో జాహ్నవి అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆ సమయంలో వాహనాలు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా.. వాహనాన్ని కెవిన్ డేవ్ అనే పోలీసాఫీసర్ 119 కిలోమీటర్ల వేగంతో నడిపాడు. దీంతో జాహ్నవి 100 అడుగుల దూరం ఎగిరిపడి మరణించింది. అయితే, జాహ్నవి మరణించినప్పటికీ కెవిన్ స్పందించలేదు. పైగా ఆమె మరణాన్ని ఎగతాళి చేశాడు. ఆమె ప్రాణానికి విలువ లేదని, ఆమె విలువ 11 వేల డాలర్లు మాత్రమే అంటూ వ్యాఖ్యానించాడు.
ఇదంతా కెవిన్ బాడీ కెమెరాలో రికార్డైంది. దీంతో జాహ్నవి మృతిని ఎగతాళి చేస్తూ, జాత్యాహంకార మాటలు మాట్లాడిన కెవిన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఇండియా, అమెరికాతోపాటు అనేక దేశాల్లో విమర్శలు వెల్లువెత్తడంతో అమెరికా స్పందించింది. కోర్టులో విచారణ అనంతరం తాజాగా సియాటెల్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.