పాలకుర్తి రూరల్/జనగామ : వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ధర్నాలు, నిరసనలు చేస్తామన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌కి సిగ్గుందా అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. గురువారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బషారత్ గార్డెన్లో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా కేంద్రాన్ని నిలదీయాలని సూచించారు.
ఎఫ్‌సీఐ కొనుగోళ్లు చేయకపోయినా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేశామన్నారు. వానకాలంలో వడ్లను కొనుగోలు చేస్తున్నామని, ఎండాకాలంలో కొనుగోళ్లు చేయడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.
రైతులకు అండగా సీఎం కేసీఆర్ ఉన్నాడన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకోని పార్టీలు ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. జన్‌ధన్ ఖాతాలో డబ్బులు ఏవని బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించారు.