హన్మకొండ : ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు తుపాకీ రాముళ్ల మాట్లాడుతున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వరంగల్ ఓల్డ్‌సిటీ గ్రౌండ్ లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సీఎం కేసీఆర్ జన్మదిన ముందస్తు వేడుకలను మంత్రి బుధవారం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన దీక్షకు బయపడి కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ మీద ఉన్న ప్రేమతో కాదని అన్నారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నేతృత్వంలో అనేక విజయాలు సాధించుకున్నామని ఆయన అన్నారు.
కేంద్రం తెలంగాణ పట్ల వివక్షను కనబరుస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం మంజూరు చేయలేదని అన్నారు. వరంగల్ జిల్లాను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు నాశనం చేశారని దుయ్యబట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న టెక్ట్స్‌టైల్స్ పార్కులో వెయ్యిమందితో నడుస్తుండగా బీఆర్ఎస్ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల రెండు లక్షల మంది వరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రెండు వేల రూపాయల పింఛన్ ఇస్తూ వృద్ధుల గౌరవాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి ద్వారా రూ.లక్ష అందిస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని ప్రశంసించారు. మూర్ఖుల మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన పాటను మంత్రి ఆవిష్కరించారు.