వరంగల్ : వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi ) తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR )పై చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) తీవ్రంగా ఖండించారు. అమెరికాలో ఉన్న ఆయన ఈ మేరకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ప్రధాని పదవి చేపట్టిన నాటి నుంచి మోదీ తెలంగాణ (Telangana )పై వ్యతిరేకతను నింపుకున్నారని ఆరోపించారు.
పునర్వీభజన హామీలు నెరవేర్చకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చారా? లేక రాజకీయం చేయడానికి వచ్చారా? అంటూ మండిపడ్డారు. అసలు తెలంగాణకు ఏం చేశారు. వరంగల్ కు ఏం చేశారో చెప్పకుండా కేసీఆర్‌ను తిట్టడానికే వచ్చారా అంటూ ప్రశ్నించారు. కాజీపేట (Kajipeta) కు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చి గుజరాత్ లోని దహోడ్ లో 20వేల కోట్లతో లోకోమోటివ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారని ఆరోపించారు.
వరంగల్ జిల్లాకు ట్రైబల్ యూనివర్సిటీ (Tribal Versity) హామీని నెరవేర్చ కుండా ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు వచ్చారని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం హామీ ఏమైందన్నారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి తెలంగాణకు వచ్చి ప్రభుత్వాన్ని దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణలోని గ్రామాలు అభివృద్ధి చెందాయని గుర్తు చేశారు. తెలంగాణ పథకాలకు పేర్లను మారుస్తూ య పథకాలను ప్రారంభించడం తప్ప దేశానికి చేసిందేమి లేదని అన్నారు.
తెలంగాణ అభివృద్ధి ని మోదీ ప్రభుత్వం అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని అన్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ ఆ ఆలయానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాకతీయ మెగా టెక్ట్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసింది సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ను నాశనం చేయడమే కాకుండా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలని మంత్రి ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.