హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దాం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్ నుంచి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కంటి వెలుగు -2 రాష్ట్ర స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా పాల్గొని మాట్లాడారు.
గ్రామాల్లో కంటి చూపు సమస్యతో బాధపడే వారి బాధలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో కంటి వెలుగు అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. మొదటి కంటి వెలుగు కార్యక్రమం చాలా విజయవంతమైందని స్పష్టం చేశారు. ఈసారి దానిని మించి విజయవంతం చేసేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అధికారులు, డీఆర్డీఏ విభాగం వారు కలిసి పని చేయాలని సూచించారు. కంటి వెలుగు క్యాంప్‌లో మీరంతా పాల్గొనాలని ఆదేశించారు. కంటి వెలుగు నిర్వహించేందుకు గ్రామంలో కావాల్సిన వసతులు దగ్గరుండి కల్పించాలన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ పంచాయతీ అధికారులు, నేతలు ఇంటికెళ్లి ఈ కార్యక్రమం దగ్గరకు తీసుకొచ్చి పరీక్షలు చేయించాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని మనం అందరం కలిసి విజయవంతం చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో సమావేశం నిర్వహించి సమన్వయం చేసుకోవాలని దయాకర్ రావు సూచించారు.