హైదరాబాద్ : తెలంగాణ సాహితీ సౌరభాలను ‘విశ్వంభర’తో విశ్వవ్యాపితం చేసి, తెలుగు కవితను మహోన్నత స్థాయిలో నిలిపిన కవి సింగారెడ్డి నారాయణరెడ్డి (సినారె) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఆచార్య సినారె వర్ధంతి సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కవిగా, రచయితగా, గేయ కావ్య కృతి కర్తగా, పరిశోధకుడిగా, విద్యావేత్తగా, సినీ గీత రచయితగా, తనదైన శైలిలో తెలంగాణ పద పదాలను పలికిస్తూ.. సాహితీ ప్రస్థానాన్ని కొనసాగించిన సృజనకారుడు సినారె అని కొనియాడారు.
దక్కనీ ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలను జుగల్బందీ చేసి, గజల్స్‌తో అలాయ్ బలాయ్ తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్‌కు సినారె సాహితీ చిరునామాగా నిలిచారన్నారు. దేశీయ, అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సాహితీ లోకంలో, తెలంగాణకు ఒక ప్రత్యేక స్థానాన్ని చేకూర్చిన సినారె కృషి అజరామరమన్నారు. భాష, సాహిత్యం నిలిచివున్నన్నాళ్లు ప్రజల హృదయాల్లో సినారె నిలిచి ఉంటారన్నారు.