హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో వరదల (Floods) పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు, సంబధిత అధికారులతో మాట్లాడుతూ నీట మునిగిన ప్రాంతాల పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు అధైర్య పడొద్దు, ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టిందన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలకు ఆహారం, నీరు అందించడంతోపాటు పునరావాసం ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
వరదల్లో చిక్కుకున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు, వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. అదేవిధంగా చేపలు పట్టేందుకు బయటకువెళ్లొద్దని, విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండాలన్నారు.
రెస్క్యూ బృందాలను, చిన్న చిన్న పడవలను రంగంలోకి దించాలని అధికారులకు సూచించారు. వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయాలన్నారు. వరదల కారణంగా రోడ్లపై పొంగి పొర్లుతున్న నీటితో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయిందని, జాగ్రత్తగా ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని ప్రజలను వెంటనే ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.