హైదరాబాద్ : ప్రముఖ సినీ, జానపద గేయ రచయిత కందికొండ యాదగిరి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంతాపం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లికి చెందిన కందికొండ ఇంటర్ నుంచే పాటలు రాయడం ప్రారంభించారన్నారు. మొదట్లో జానపద గీతాలు రాసి.. ఆ తర్వాత సంగీత దర్శకుడు చక్రితో ఉన్న అనుంబంధంతో సినిమా సాహిత్యం వైపు మొగ్గు చూపారన్నారు.
తన పన్నెండేళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికిపైగా పాటలు రాశారని, తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు రచించారన్నారు. ఆయన రాసిన బతుకమ్మ పాటలు పల్లె పల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి. కవిగా, కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందిన ఆయన మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి మంత్రి ఎర్రబెల్లి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు.