సికింద్రాబాద్, ఆగస్టు 30: ఉపాధి హామీ అమలులో నంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణలో ఆ పథకాన్ని నిలిపేసేందుకు కేంద్ర ప్రభు త్వం కుట్ర పన్నుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. దీనిలో భాగంగానే రకరకాల తనిఖీలు, కొర్రీలతో రాష్ర్టాన్ని వేధిస్తున్నదని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఉపాధి హామీ పథకాన్ని నిలిపేసినట్టుగా తెలంగాణలో చేయాలనుకొంటే కుదరదని, రాష్ట్ర ప్రజలు తిరగబడటం ఖాయమని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, టీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో మంగళవారం బోయిన్‌పల్లిలో నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కృతజ్ఞత సభను ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో లేని ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ర్టాలకు కేంద్రం ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉపాధి హామీ పర్యవేక్షక బృందాలను పంపి వేధిస్తున్నదని గుర్తుచేశారు. ఇదేవిధంగా ఈ ఏడాది ఇప్పటికే తెలంగాణకు ఏకంగా 18 బృందాలను పంపిందని, లేని తప్పులను ఎత్తిచూపడం ద్వారా పేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్నదని వివరించారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. గతంలో కొందరి స్వార్థానికి ఫీల్డ్ అసిస్టెంట్లు బలయ్యారని, అయినా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో వారికి మళ్లీ అవకాశం కల్పించారని గుర్తుచేశారు. ఇప్పటికైనా సక్రమంగా పనిచేసి గ్రామాలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు హితవు పలికారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు, కార్యదర్శి రూప్ సింగ్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నేతలు మేకల రవి, కంకల సిద్ధిరాజ్, దయామణి తదితరులు పాల్గొన్నారు.