Minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావుకు పార్టీకి మంత్రులతో పాటు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. డప్పులు, బోనాలు, లంబాడీ, కోలాటం కళాకారుల నృత్యాలు, టపాసులు పేల్చుతూ యువత, మహిళలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన ప్రజలు సాదర స్వాగతం పలికారు.
అనంతరం అంబారీపేట నుంచి తాళ్లకొత్తపేట వరకు రూ.12కోట్లు, పైడిపల్లి నుంచి పడకల్ వరకు రూ.1.40కోట్లు, రూ.30లక్షలతో ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని చెప్పారు. ఇవాళ తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రూ.14వేలకోట్లు ఖర్చుపెట్టి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారని చెప్పారు.
ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్, డంపింగ్ యార్డ్, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, కల్లాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు నిర్మించారన్నారు. మరో వైపు సమృద్ధిగా సాగునీరు, రైతులకు ఎదురు పెట్టుబడిగా రైతుబంధు, రైతు బీమా, రుణాల మాఫీ, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, చివరికి పంటలు కొనుగోలు వరకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందన్నారు. మరోవైపు, సంక్షేమ కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని మంత్రులు చెప్పారు.
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల మరమ్మతులు చేయడంతో భూగర్భ జలాలు పెరిగి పంటలు దిగుబడి పెరిగాయన్నారు. పాడిపంటలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అయితే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని మంత్రులు మండిపడ్డారు. నిధులు ఇవ్వకపోగా వివిధ పథకాల్లో కోతలు విధిస్తూ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. ఇందుకు ఉదాహరణగా ఉపాధి హామీ అని తెలిపారు. అలాగే, రాష్ట్రపరంగా చేసే అప్పుల విషయంలోనూ అనేక ఆంక్షలు విధించారని, బీజేపీ ఎంపీలతో రాష్ట్రానికి, వారు ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గానికి.. చివరకు సొంత గ్రామాలకు సైతం ఒరిగేమీ లేదన్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ ఇంటికి చేరుకొని తండ్రి గంగుల మల్లయ్య పటేల్, అన్న ప్రభాకర్ పటేల్ చిత్రపటాలకు నివాళులర్పించారు.