వెల్గటూర్, ఏప్రిల్ 3: ఏడున్నర దశాబ్దాలుగా దేశాన్ని దోచి కార్పొరేట్ శక్తులను పెంచిపోషిస్తున్న కాంగ్రెస్, బీజేపీలను రాబోయే రోజుల్లో బొందపెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రజలను కోరారు. సోమవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని పైడిపల్లిలో వివిధ అభివృద్ధి పనులను మరో ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలంగాణలోని గ్రామాలు నీళ్లు లేక ఎడారులను తలపించాయని చెప్పారు.
తాగు, సాగు నీరు, కరెంట్ లేక రైతులు అరిగోస పడ్డారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులు నిర్మించి, తాగు, సాగు నీరు అందించడమే కాకుండా 24 గంటలు ఉచిత విద్యుత్తును ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఏదో సాధించినట్టు రోడ్ల మీద తిరుగుతూ అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని, అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచం ద్ర, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పాల్గొన్నారు.