మహబూబాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అవగాహన లేని మూర్ఖులని, అలాంటి వారి మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఆయన మహబూబాబాద్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పాలించే కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో అభివృద్ధిని చూద్దాం..
తెలంగాణ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూద్దాం.. తెలంగాణ కంటే అక్కడి రాష్ర్టాల్లోని గ్రామాలు బాగుంటే నేను నా మంత్రి పదవిని వదులుకుంట. అంతేకాదు రాజకీయాల నుంచి తప్పుకుంట. ఒకవేళ నిరూపించకపోతే మీరు పదవులు వదులుకోవాల్సిన అవసరం లేదు. క్షమాపణలు చెబితేచాలు’ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన వైకుంఠధామాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, డంపింగ్‌యార్డులు ఈ మూర్ఖులకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. పల్లెల్లో జరిగిన అభివృద్ధిని చూసి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటే ఈ మూర్ఖులేమో అవేవీ తెల్వనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిధులను మళ్లించినట్టు చెప్పడం కాదు.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. కేంద్రం నుంచి రూ.1,100 కోట్లు రావాల్సి ఉన్నదని, 8 నెలలుగా డబ్బులు ఆపితే సర్పంచ్‌లు ఇబ్బందులు పడరా? అని ప్రశ్నించారు. రైతులు కల్లాలు కడితే వాటి బిల్లులు కూడా ఆపారని, ఇతర రాష్ర్టాల్లో ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మెటీరియల్ కాంపోనెంట్ తెలంగాణ హక్కు, అది కేంద్రం ఇచ్చే భిక్ష కాదని, ఏది ఏమైనా రూ.700 కోట్లు రాష్ర్టానికి రావాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి డబ్బులు రాకపోవడం వల్లే చెక్కులు విడుదల కావడం లేదని అన్నారు. కేంద్రం తీరు వల్లే సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లులపై చర్చకు సిద్ధమా? అని మంత్రి ఎర్రబెల్లి సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధిని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వచ్చి చూడాలని తెలిపారు. మానుకోట జిల్లా 8 ఏండ్ల కింద ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉన్నదో చూస్తే అర్థమవుతుందని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.