హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తేసేందుకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. కేంద్రంపై పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు- సవాళ్లు’ అనే అంశంపై మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించిన సెమినార్లో మంత్రి మాట్లాడారు. తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో మొదటి నుంచీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగానే ఉంటూ వస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ఇన్నేండ్లలో రాష్ర్టానికి ఒక్క పథకం కూడా ఇవ్వలేదని విమర్శించారు.
వ్యవసాయ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినప్పటి నుంచే కేంద్రంతో తగాదా మొదలైందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం బడ్జెట్ను ఇప్పటికే రూ.75 వేల కోట్లు తగ్గించిందని విమర్శించారు. కేరళ రాష్ట్ర స్థానిక స్వపరిపాలన, ఎక్సైజ్ శాఖ మంత్రి ఎంబీ రాజేశ్ మాట్లాడుతూ.. దేశ సమాఖ్య వ్యవస్థను కేంద్రం ధ్వంసం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ర్టాల్లో గవర్నర్లను ఉసిగొలిపి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. కావాలనే కేరళ, తెలంగాణ రాష్ర్టాలపై కక్షగట్టి ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో కలిసివచ్చే రాష్ట్రాలతో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ చర్యలు ఎండగడతామని పేర్కొన్నారు. సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ వెంకట్, సీపీఎం జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.