దేవరుప్పుల, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ విధానాలను జాతి యావత్ గమనిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తున్నదని చెప్పా రు.
బీజేపీ నేతలు తొండికూతలు మాని, కేంద్రం నుంచి మరో రూ.10 వేల తీసుకొని రావాలని సూచించారు. బీఆర్ఎస్ ఎదుగుదలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓర్వలేక పోతున్నదని, అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాద బలంతో వీటిని సునాయాసంగా తిప్పికొడుతున్నామని చెప్పారు. కేసీఆర్ మార్గదర్శనంలో అంకితభావంతో పనిచేసే అధికారులే తెలంగాణ ప్రభుత్వ విజయ రహస్యమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో బలం లేకున్నా మాటలతో పబ్బం గడుపుతున్నదని ఎద్దేవా చేశారు.