పాలకుర్తి (జనగామ) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అధోగతి పాలయిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) ఆరోపించారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గంలోని గూడురు, పాలకుర్తి గ్రామాల్లో నిర్వహించిన బీఆర్ఎస్(BRS Meeting) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తరువాత పరిపాలన ఎట్లా ఉందో ప్రజలు విశ్లేషించుకోవాలని కోరారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ( Mission Kakatiya), నిర్మించిన ప్రాజెక్టులతో భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ వల్ల ఏడాదికి రూ.10.500 కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. సమైక్య రాష్ట్రంలో 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం దివాలా తీసిందని అన్నారు. ప్రస్తుత బీజేపీ పాలనలో ఎల్ఐసీ(LIC) లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తుందని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఎదురు పెట్టుబడిగా రైతు బంధును ఇస్తుందని చెప్పారు. రైతు బీమా పథకం ప్రీమియం కట్టడమేగాక, ఏ కారణం చేతనైనా రైతు చనిపోతే అతని కుటుంబానికి 10 రోజుల్లోపు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నది కూడా ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనన్నారు .
57 ఏండ్లు నిండిన అర్హులైన వారందరికీ త్వరలోనే పెన్షన్లు అందచేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కార్యకర్తపై ఉందని అన్నారు. ప్రజలు సీఎం కేసీఆర్(CM KCR)కు అండగా నిలవాలని ఆయన కోరారు.