జనగామ : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ పల్లెలు నేడు స్వపరిపాలనలో సంపూర్ణ అభివృద్ధిని సాధిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) అన్నారు. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా తొమ్మిది కేటగిరీలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన జనగామ జిల్లాలోని 36 గ్రామ పంచాయతీలకు అవార్డు(Award)లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీలు, సర్పంచుల మధ్య పోటీ తత్వం పెరిగి, మరింత అభివృద్ధి జరగాలన్న సంకల్పంతో వివిధ ప్రామాణిక సూచికల ఆధారంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామన్నారు.గతంలో నిధులు లేక సర్పంచులు అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తాగునీరు, కరెంటు, పంచాయతీ భవనాలకు కిరాయిలకు కూడా నిధుల కొరత ఉండేదని అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్(CM KCR) నేతృత్వంలో గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారని వెల్లడించారు.
మిషన్ భగీరథ(Mission Bhagiratha) ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా నీరందిస్తున్నామని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలు, రైతు కల్లాలు, రైతు వేదికలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేశామన్నారు. గ్రామాల అభివృద్ధితో జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలకు అవార్డులు వస్తున్నాయని వివరించారు. పల్లెప్రగతి ద్వారా తెలంగాణ రాష్ట్రం 15 వేల కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇచ్చామని తెలిపారు .
కేంద్రం కక్ష సాధింపు చర్యలు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద కక్షతో వ్యవహరిస్తున్నదని మంత్రి దయాకర్ మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం లో 13 కోట్ల పనిదినాల ను 7 కోట్లకు తగ్గించిందని ఆరోపించారు.ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వేయాలని కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అనాలోచితంగా మాట్లాడుతున్నారని అన్నారు.
పంట నష్టం పరిహారం కింద కేంద్రం ఎకరాకు 3 వేలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రైతులకు పంట నష్టపరిహారం కింద రూ. 10 వేలు ఇస్తుంటే విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య ,అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి, డీఆర్డీవో రామిరెడ్డి, అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.