జనగామ : మహబూబాబాద్ మెడికల్ కాలేజీ, సమీకృత కలెక్టరేట్ భవన సముదాయానికి ప్రారంభోత్సవం చేయనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. కొడకండ్లలో మినీ టెక్స్ టైల్ పార్క్‌కు కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో దేవరుప్పుల, కొడకండ్ల, పాలకుర్తి మండలాలలో వేర్వేరుగా నిర్వహించిన దళిత బంధు సమీక్షలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు.
కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా అన్ని స్కూల్స్‌ను ప్రైవేటు ధీటుగా తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు – మన బడి, మన బస్తీ – మన బడి’ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. 6వేలకోట్ల వ్యయంతో ఈ పనులు మొదలయ్యాయన్నారు. పలు పాఠశాలలను ఇంగ్లిష్ మీడియానికి అప్‌గ్రేడ్ చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు అన్ని వర్గాల ప్రజల కోసం గురుకుల పాఠశాలలు, కాలేజీలను ప్రారంభించినట్లు వివరించారు. ప్రాథమిక స్థాయి నుంచి వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తూ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి.. అందరికీ వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఇందులో భాగంగా జనగామ, మహబూబాబాద్‌కు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారన్నారు. మహబూబాబాద్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభానికి సిద్ధమైందని, దీంతో పాటు కలెక్టరేట్‌కు సైతం త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నట్లు చెప్పారు.
కొడకండ్లలో మినీ టెక్స్టై పార్క్ ఏర్పాటు చేయున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళిత బంధు పథకం అమలు చేస్తున్నరాని మంత్రి పేర్కొన్నారు. పథకంలో అందరికీ ఒకేసారి లబ్ధి చేకూర్చడం సాధ్యం కాదని, దశలవారీగా అందరికీ ఫలితాలు అందుతాయన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో భాగంగా క్లస్టర్ల వారీగా విభజన చేసి, లాటరీ తీసి, లాటరీలో వచ్చిన క్లస్టర్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులను అందేలా చూడాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, దళితులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.