హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు సాంకేతిక కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. దవాఖానల నిర్మాణ పనుల పురోగతిపై గురువారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దవాఖానల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తేవాలని సూచించారు.
వరంగల్‌లో 2,100 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్‌లోని అల్వాల్‌లో 1200 పడకలు, ఎల్బీనగర్, సనత్‌నగర్‌లో 1000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిమ్స్‌లో 2 వేల పడకలతో చేపట్టిన విస్తరణ పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి, వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పారు. సమీక్షలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ, డీఎంఈ వాణి, అడిషనల్ డీఎంఈ శివరాం ప్రసాద్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.