హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి దామోదర రాజనర్సిం హా ఆదేశించారు. అవసరమైన వారికి టెస్టులు చేసి, మెడిసిన్ అందజేయాలని సూచించారు.
ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాణి, వైద్యవిధాన పరిషత్తు కమిషనర్ అజయ్‌కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవిందర్ నాయక్‌తో మంత్రి సోమవారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదతీవ్రత ఎకువగా ఉన్న ఖమ్మం జిల్లాలో 10 మెడికల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రతి టీమ్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లు, సిబ్బంది, టెస్టులు చేయడానికి అవసరమైన పరికరాలు, మెడిసిన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ బాధ్యతలను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్‌కు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదల ఫలితంగా దాదాపు రూ.5,438 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 110 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 4,000 మందికి పైగా ప్రజలను సురక్షితంగా శిబిరాలకు తరలించినట్టు వెల్లడించింది.
రోడ్లు, భవనాలశాఖకు రూ.2,362 కోట్లు, ఇంధనశాఖ (ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్‌కు నష్టం) రూ.175 కోట్లు, పంట నష్టం 4,15,000 ఎకరాల్లో రూ.415 కోట్లుగా, నీటిపారుదల (మైనర్ ట్యాంకుల మరమ్మతులు) రూ.629 కోట్లుగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.170 కోట్లుగా, వైద్యారోగ్యశాఖకు రూ.12 కోట్లుగా, పశు సంవర్ధక శాఖ రూ.25 కోట్లుగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ రూ.1,150 కోట్లు, ఇతర విభాగాల్లో రూ.500 కోట్ల ప్రజాఆస్తులకు నష్టం వాటిల్లినట్టు తెలిపింది.