హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): హెల్త్ విభాగంలోని అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేసి, ఆయా సంస్థలను బలోపేతం చేయాలని అధికారులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ తనిఖీలు నిరంతరం నిర్వహించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నాచారంలోని ఫుడ్ సేఫ్టీ ల్యాబ్, తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలను బలోపేతం చేయాలని, వాటిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీజనల్ వ్యాధుల నిర్మూలనకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కోరారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల, ఉన్నతాధికారులు దేవేందర్‌కుమార్, సురేందర్‌రెడ్డి ,జగదీశ్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.