హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఇందుకు అనుగుణంగా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ టీజీ ఎంఎస్ఐడీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని టీజీఎంఎస్ఐడిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి అధికారులు సమీక్షలో ఆయన మాట్లాడారు.
కొత్త టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్, డయాగ్నస్టిక్స్ ఎక్విప్మెంట్, ఫర్నీచర్ కొనుగోళ్లపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో వినియోగిస్తున్న ఎక్విప్మెంట్ ఏంటో డాక్టర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫర్నీచర్ కొనుగోలు చేయాలన్నారు. కొత్త హాస్పిటళ్లకు పేషెంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, ఆ అంచనాలకు తగ్గట్టుగా ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సరిపడా ఉండాలన్నారు. కొనే ప్రతి వస్తువుకూ వారంటీ ఉండాలని, మెయింటెనెన్స్ విషయంలో సప్లయర్లను బాధ్యులుగా చేయాలన్నారు. ఒక్క వస్తువు కూడా రిపేర్‌లో లేదా నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు.
ప్రభుత్వ దవఖానాల్లో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్వోడీలను మంత్రి వివరాలు అడిగారు. అవసరమైన అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయా? లేవా అని డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, డీహెచ్‌ను అడిగి తెలుసుకున్నారు. సెంట్రల్ మెడిసినల్ స్టోర్లలో కనీసం 3 నెలలకు సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని టీజీఎంఎస్ఐడీసీ అధికారులకు మంత్రి సూచించారు. హాస్పిటల్స్‌లో ఉన్న ప్లేట్లెట్ సెపరేషన్ మిషన్లు వర్కింగ్ కండీషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీ డయాగ్నస్టిక్స్ హబ్స్‌లో అన్నిరకాల టెస్టులు, స్కాన్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ఒక్క టెస్టు కోసం కూడా పేషెంట్‌ను బయటకు పంపించొద్దన్నారు. ప్రతి పీహెచ్‌సీలోనూ టెస్టులు అవసరమైన పేషెంట్ల నుంచి సాంపిల్స్ సేకరించాలని, 24 గంటల లోపల రిపోర్టులు అందజేయాలని మంత్రి ఆదేశించారు. గతేడాది కొత్తగా ప్రతి జిల్లాలోనూ మెడిసినల్ స్టోర్లను ఏర్పాటు చేశామని, ఆయా స్టోర్లకు పర్మినెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అన్ని జిల్లాల్లో బిల్డింగుల నిర్మాణాన్ని ప్రారంభించి, త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మెడికల్ కాలేజీలు అన్నింటిలోనూ సీటీ స్కాన్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, అలాగే అవసరమైన చోట ఎంఆర్ఐ యంత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. ఎంఆర్ఐ మిషన్ల కొనుగోలు, ఇన్స్టాలేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.