Damodar Raja Narasimha | జగిత్యాల : కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి అని, అసలైన కాంగ్రెస్ వాది ఆయనే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండు రోజుల జగిత్యాల జిల్లా పర్యటన నిమిత్తం శనివారం రాత్రి ధర్మపురి విచ్చేసిన మంత్రి రాజనర్సింహా ఆదివారం ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వైద్య సేవలు, ఆసుపత్రుల బలోపేతంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి రాజానర్సింహ చేరుకొని కొంత సేపు ముచ్చటించారు.
ఈ సందర్భంగా విలేకరులు జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిల మధ్య వార్ నడుస్తుందన్న ప్రశ్నలకు మంత్రి రాజానర్సింహ సమాధానమిస్తూ మేము జీవన్ రెడ్డి అన్న శిష్యులం, ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు, పెద్ద అసెట్ అంటూ వ్యాఖ్యానించారు. అసలు, సిసలైన కాంగ్రెస్ వాది జీవన్ రెడ్డి, మేము ఆయన శ్రేయోభిలాషులం. పార్టీలో అందరికంటే సీనియర్ నాయకులు, పార్టీకి మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. మంచి ఆలోచనపరుడని జీవన్ రెడ్డి గురించి మంత్రి రాజానర్సింహ మాట్లాడారు. మేము ఆయన కంటే పార్టీలో జూనియర్లమని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డి గురించి పార్టీ ఆలోచిస్తుందని, ఆయనకు మంచి జరగాలనే ప్రయత్నం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గయ్య, నక్క జీవన్, రఘువిర్ గౌడ్, గుండా మధు, గిరిధర్, బొల్లి శేఖర్, నాగరాజు, తదితరులున్నారు.