హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణతో మాదిగ, మాదిగ అనుబంధ కులాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు మెరుగవుతాయని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాదిగ, మాదిగ అనుబంధ కులాల ఎమ్మెల్యేలు, సంఘాల ముఖ్య నాయకులతో సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు క్షేత్రస్థాయిలో రిజర్వేషన్ల ప్రక్రియను వివరించాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణతో ఏ కులానికి అన్యాయం జరగదని స్పష్టంచేశారు. అణగారిన కులాల్లో అసమానతలు రూపుమాపేందుకే ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, తోట లక్ష్మీకాంతారావు, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ మం త్రులు మోత్కుపల్లి నరసింహులు, చంద్రశేఖర్, మాజీ ఎంపీ పసునూరు దయాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య, ప్రొఫెసర్ మల్లేశం, ముంజగల విజయ్‌కుమార్, మేడి పాపయ్య, గజ్జెల కాంతం, ఏపూరి సోమన్న, కృపాకర్, మేరీ, చంద్రశేఖర్, గోపి, రాజు పాల్గొన్నారు.