హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజారోగ్యానికి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో భారీ వర్షాల ప్రభావిత జిల్లాల వైద్యశాఖ అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. వర్షాలు అధికంగా కురుస్తున్న మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేటతో పాటు ఇతర జిల్లాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. వచ్చే రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, ఫార్మాసిస్ట్లు, ఆసుపత్రి సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా మెరుగైన పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరారు. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ, డిజాస్టర్ మెనేజ్మెంట్ అధికారులతో సమన్వయం చేసుకుని అధిక వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.