Praja Darbar | హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ పేరు మారుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రజావాణిగా పిలువాలని అధికారులకు సోమవారం ఆదేశాలకు జారీ చేశారు. ఇక నుంచి వారానికి రెండు రోజులు మంగళ, శుక్రవారాల్లో ప్రజావాణి నిర్వహించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఉదయం 10 గంటల్లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుతో పాటు ప్రజల సౌకర్యార్థం తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
దరఖాస్తులపై పూర్తి అడ్రస్ రాయండి
ప్రజాదర్బార్‌లో ఇచ్చే వినతులపై పూర్తిస్థాయిలో అడ్రస్, సెల్‌ఫోన్ నంబర్ రాయాలని, అవసరమైతే సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. సోమవారం ఆయన ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు సమస్యతో పాటు పూర్తి వివరాలు ఇస్తే సమస్య పరిష్కారానికి సంబంధించిన అప్డేట్ సులువుగా తెలుస్తుందని చెప్పారు. ఈ నెల 17న రెండు, మూడు పరీక్షలు ఉన్నందున టీఎస్ జెన్కో ఏఈ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. తమకు ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రతినెలా రెగ్యులర్‌గా ఇవ్వాలని మధ్యాహ్న భోజన వంట కార్మికులు వినతిపత్రం ఇచ్చినట్టు చెప్పారు.