Telangana | హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించవచ్చని తెలుస్తున్నది. శనివారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఆవరణలో జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఆమోదం తెలుపనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు. తిరిగి సోమవారం అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా బడ్జెట్ అంశాలపై చర్చ జరుగనున్నది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా.. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తున్నది. ఏటా సాధారణంగా జరిగే.. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం మళ్లీ జూన్ లేదా జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది.
గతంకంటే ఈ సారి బడ్జెట్లో సుమారు రూ.20 వేల కోట్ల వరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్నది. నిరుడు 2023-24లో అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అందులో ప్రధానంగా రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా ప్రతిపాదించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటా రూ.21,471 కోట్లు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూ.41,259 కోట్లుగా అంచనా వేశారు. అయితే.. కరోనా తర్వాత కేంద్రం రాష్ర్టాలకు ఇచ్చే గ్రాంట్లలో కోతలు విధిస్తున్నది. అందులో ప్రత్యేకించి తెలంగాణకు ఇచ్చే గ్రాంటుల్లో భారీగా కోత పెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ను బడ్జెట్లో తగ్గించాలని చూస్తున్నట్టు తెలిసింది. ఏటా కేటాయింపులతో పోలిస్తే సుమారు 40 నుంచి 50 శాతం గ్రాంటును తగ్గించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అందుకే బడ్జెట్లో సుమారు రూ.20 వేల కోట్లు తగ్గించనున్నట్టు తెలిసింది.