నిర్మల్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ సమీపంలో తనకు భూములున్నట్టు నిరూపిస్తే, వారికే రాసిస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు. కొత్తగా ఏర్పడ్డ నిర్మల్ జిల్లాలో అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం లక్ష్మణచాంద మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి, స్థానికంగా తనకున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇలాంటి కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మిస్తున్న స్థలాన్ని తాము ఎంపిక చేయలేదని, రాష్ట్రస్థాయి కమిటీ నివేదిక మేరకే అక్కడ కలెక్టరేట్ నిర్మాణం జరుగుతున్నదని స్పష్టంచేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని చెప్పారు. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవుపలికారు.