ఖమ్మం, మే 15: గొంగళి పురుగులా ఉన్న ఖమ్మాన్ని తొమ్మిదేండ్లలో సీతాకోక చిలుకలా తీర్చిదిద్దినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. ‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా మంత్రి అజయ్‌కుమార్ సోమవారం ఉదయం 6 గంటలకే కేఎంసీ కార్యాలయం నుంచి సైకిల్‌పై బయలుదేరి పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువై నగరంలోని సమస్యలన్నింటినీ అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో ‘వాడవాడ పువ్వాడ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఇప్పటికే తాగునీటి సమస్యను పూర్తిగా అధిగమించామని స్పష్టం చేశారు. చెత్త సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని, గతంతో పోల్చితే ప్రస్తుతం రోడ్ల మీద చెత్త కన్పించడం లేదని తెలిపారు. మున్సిపల్ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తున్నట్టు చెప్పారు. ఇక మురుగును సైతం పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో కేవలం డ్రెయిన్ల నిర్మాణానికే డివిజన్‌కు రూ.40 లక్షల చొప్పున కేటాయించినట్టు తెలిపారు. గోళ్లపాడు చానల్ అండర్ గ్రౌండ్ 11 కిలోమీటర్లను నిర్మించిన విధంగానే త్వరలో 23 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ పనులకు మంత్రి కేటీఆర్ త్వరలోనే శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మంత్రి వెంట కలెక్టర్ వీపీ గౌతమ్, కేఎంసీ మేయర్ నీరజ, కమిషనర్ ఆదర్శ్ సురభి ఉన్నారు.