హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీల్లోని పార్ట్‌టైం, అవుట్సోర్సింగ్, సబ్జెక్ట్ అసోసియేట్లకు సంబంధించిన వేతన బకాయిలు రూ.11కోట్లు విడుదల చేసినట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఎస్సీ గురుకుల సొసైటీలో పనిచేస్తున్న 2,469 మందికి గడిచిన రెండు నెలలుగా, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలోని సబ్జెక్ట్ అసోసియేట్లకు 5 నెలలుగా ప్రభుత్వం వేతనాలను చెల్లించలేదు. ఇదే విషయమై ‘నెలల తరబడి వేతనాలివ్వకపోతే బతికేదెట్లా..?’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో మంత్రి లక్ష్మణ్ స్పందించారు.
సచివాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వేతన బకాయిలు రూ.11.53 కోట్లు విడుదల చేసినట్టు ప్రకటించారు. ట్రైబల్ వెల్ఫేర్ సీవోఈల్లోని సబ్జెక్ట్ అసోసియేట్స్, సీనియర్ ఫ్యాకల్టీ, గేమ్స్ కోచ్‌లకు సంబంధించి రూ. 2.38 కోట్లు రిలీజ్ చేసినట్టు తెలిపారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అశోక్‌నగర్‌లో ఎస్సీ హాస్టల్ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. గ్రూప్ 1 విషయంలో ఆధారాలుంటే నిరూపించాలని, విద్యార్థుల భవిష్యత్ విషయంలో తమ ప్రభుత్వం తప్పు చేయబోదని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మాణ దశలో ఉన్నట్టు వెల్లడించారు.