జగిత్యాల, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మీడియా ముందు ప్రకటించడం, పక్కనే ఉన్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించకపోవడం సంచలనంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం మంత్రి అడ్లూరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో పాటు ఇతర అంశాలపై మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 80 శాతం గ్రామ పంచాయతీల్లో విజయం సాధించిందని చెప్పారు. తాను అడిగినా, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ అడిగినా, నందన్న అడిగినా సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తారని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు అంశంపై విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితమే స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై స్పీకర్ ఇంకా రూలింగ్ ఇవ్వలేదు. ఈ తరుణంలోనే మంత్రి అడ్లూరి .. సంజయ్‌కుమార్‌ను కాం గ్రెస్ ఎమ్మెల్యేగా మీడియా ఎదుటనే ప్రకటించడం సంచలనంగా మారింది.
పార్టీ మారలేదంటూ స్పీకర్ ముందు వాంగ్మూలం ఇచ్చిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, తన ముందే మంత్రి మీడియాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అని ప్రకటిస్తున్నా స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్పీకర్ రూలింగ్ ఇవ్వాల్సిన తరుణంలో మంత్రి వ్యాఖ్యలు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ మార్పునకు పక్కా ఆధారాలవుతాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.