Adluri Laxman |జగిత్యాల, అక్టోబర్ 12(నమస్తే తెలంగాణ): కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన మాలల సమావేశంలో మంత్రి వివేక్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్పందించారు. మాలల సమావేశంలో మంత్రి వివేక్ తనను విమర్శించడం బాధాకరమని అన్నారు. తాను కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా, పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తించలేనని స్పష్టంచేశారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, ప్రభుత్వాన్ని నిర్వహించాల్సిన బాధ్యత తమపై ఉన్నదని తెలిపారు. తాము రాహుల్‌గాంధీ నేతృత్వంలో పని చేస్తున్నామని స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోపాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే అంశంపై దృష్టిపెడుతున్నామని చెప్పారు. వివేక్ తనపై ఆరోపణలు చేయడం, చర్చించడం వంటి అంశాలు పార్టీ అంతర్గత వేదికలపై జరగాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలపై తాను స్పందించలేనని స్పష్టం చేశారు. తాను ఒకటే పార్టీకి, ఒకటే జెండాకు కట్టుబడి ఉన్నానని.. పార్టీ లైన్ దాటి ప్రవర్తించబోనని తెలిపారు.