హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : జాతీయాభివృద్ధిలో మైనింగ్ రంగానిదే కీలక పాత్ర అని, ఈ రంగం ఆర్థికంగా, సామాజికంగా అనేక మార్పులకు కారణమవుతుందని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సీఎండీ అమితావ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఈఐఏ) హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో మైనింగ్ ది మినల్స్ వే ఫార్వార్డ్ టువర్డ్స్ అత్మనిర్బర్ వికసిత్ భారత్-2047 అంశంపై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు నిర్వహించారు. అమితావ ముఖర్జీతోపాటు సింగరేణి సీఎండీ ఎన్ బలరాం తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అమితావ ముఖర్జీ మాట్లాడుతూ.. సుస్థిర మైనింగ్ పద్ధతులను అనుసరించాలని, సామాజిక సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. మైనింగ్ విధానాలను సరళీకరించడం ద్వారా విదేశీపెట్టుబడులను ఆహ్వానించగలమని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎంఎస్ వెంకటరమణయ్య, కార్యదర్శి ఎల్ కృష్ణ, సంయుక్త కార్యదర్శి వీ బాలకోటిరెడ్డి, కోశాధికారి సంజీవ్‌కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.