అమ్రాబాద్: నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో (Domalapenta) పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఓ మినీ బస్సు దోమలపెంట వద్ద బోల్తాపడింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్కు చెందిన 40 మంది భక్తులు ఓ ప్రైవేటు మినీ బస్సులో శ్రీశైలానికి బయల్దేరారు. దోమలపెంట బస్టాండ్ వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో వాహనం అదుపుతప్పింది. దీంతో అదుపుచేసే క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు కార్లను బస్సు ఢీకొట్టింది. అప్పటికీ ఆగని బస్సు కొంతదూరం వెళ్లి బోల్తా పడింది.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను దోమలపెంట జెన్కో దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.