హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎజెండాను అర్ధరాత్రి ఇచ్చారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇచ్చిన ఎజెండా ఒకటైతే సభలో మరోటి చర్చకు పెడుతున్నారని ఆక్షేపించాయి. శుక్రవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే, తెలంగాణ సివిల్ న్యాయస్థానాల సవరణ బిల్లు, ఆ తర్వాత తెలంగాణ శాసనాల బిల్లు (సంక్షిప్త పదాల మార్పు), తెలంగాణ పబ్లిక్ సర్వీసు నియామకాల క్రమబద్ధీకరణ, సిబ్బంది తీరు, వేతన రేషనలైజేషన్ సవరణ బిల్లులను సభ ఆమోదానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. దీనిపై విపక్ష సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ రాత్రి 1.40 గంటలకు తనకు ఎజెండా అందిందని, సభ్యులు ఎప్పుడు ప్రిపేరవుతారని ప్రశ్నించారు.
బిల్లులపై సభ్యులు అభిప్రాయాలను ఎలా చెప్తారని ప్రశ్నించారు. ఎజెండాను ముందుగా పంపాలని ప్రతిసారి విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక బిల్లు చర్చకు పెట్టి వేరే అంశాలపై చర్చిస్తున్నారని, ఇలాంటిది తన 25ఏండ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని వాపోయారు. మిత్రపక్షంగా స్పందించకపోతే ఎలా? అంటూ సీపీఐ ఎమ్మెల్యేను అక్బరుద్దీన్ కోరారు. ‘మీకు ఎజెండా అయినా వస్తున్నది. మాకు అది కూడా రావడం లేదు’ అంటూ కూనంనేని బదులిచ్చారు.
ఇదే విషయమై బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ మండిపడ్డారు. ఒకే రోజు బిల్లులను ప్రవేశపెట్టడం, అభిప్రాయాలు తీసుకోవడం, ఆమోదించడం తగదని చెప్పారు. ఎజెండాను ముందుగా ఇవ్వాలని, బిల్లులపై చర్చించేందుకు అవకాశమివ్వాలని సూచించారు. ఎంఐఎం, సీపీఐ, బీజేపీ సభ్యుల వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు సైతం మద్దతు పలికారు. ప్రభుత్వ చర్యను మాత్రం మంత్రి దుద్దిళ్ల సమర్థించారు. ప్రాధాన్యం లేని అంశాలున్నప్పుడే ఇలా జరుగుతున్నదని చెప్పారు.