MIM | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 ( నమస్తే తెలంగాణ ): ‘హైడ్రా హటావో.. ఘర్ బచావో’ నినాదం పాతబస్తీలో మార్మోగింది. సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రాకు వ్యతిరేకంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, నాయకులు బహదూర్‌పుర, కిషన్‌బాగ్‌లో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా బహదూర్‌పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ మాట్లాడుతూ.. పాతబస్తీలోకి బుల్డోజర్లు వచ్చే దమ్ముందా.. వస్తే తామేంటో చూపిస్తామని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం మొండిగా ఇండ్లను కూల్చడానికి యత్నిస్తే.. బుల్డోజర్ల ముందు తాము నిలబడతామని సవాల్ విసిరారు.
ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని చెప్పారు. ఎలాంటి నష్టపరిహారం, ప్రత్యామ్నాయ నివాసం ఏర్పాటు చేయకుండా రేవంత్ సర్కార్ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నదని విమర్శించారు. ‘హైదరాబాద్ కలెక్టర్‌తో చర్చించామని.. 2003లో మూసీ నది ఫిజికల్ సర్వే ప్రకారం స్వాధీనం చేసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు. మూసీ నిర్వాసితులకు మద్దతుగా ఆందోళన చేసిన కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు తరలించగా ఎంఐఎం నాయకులు వెళ్లాక విడుదల చేశారు.
హైడ్రా ఏర్పాటు నుంచి ఎంఐఎం పార్టీ వ్యతిరేక గళం వినిపిస్తూనే ఉన్నది. పాతబస్తీలోని ఫాతిమా కాలేజీ కూల్చివేయాలని ప్రచారం జరగడంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు. ‘కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.. కత్తులతో దాడి చేయండి. కాలేజీలను మాత్రం కూల్చేయకండి’ అంటూ అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విద్యాసంవత్సరం మధ్యలో విద్యార్థులకు నష్టం చేయమని హైడ్రా వెనక్కి తగ్గి, పేదల ఇండ్లను కూల్చుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.