ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోగల పెన్‌గంగా నది పరీవాహక ప్రాంతంలో మంగళవారం ప్రయాణికులకు మూడు పులులు కనిపించాయి. తెలంగాణలోని అంతర్గాం, గుబిడిలకు ఆవల ఉన్న మహారాష్ట్ర, మంగి, సవర్గాం గ్రామాల మధ్య పెద్ద పులులు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పులులు తరచూ తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి వచ్చి వెళ్తుంటాయని మంగి గ్రామానికి చెందిన రైతులు ఓంకారం, రమేశ్ తెలిపారు.
మెదక్ జిల్లా పోచారం వన్యప్రాణుల అభయారణ్యంలో సీజనల్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీరామ్ ఆదిత్య సోమవారం టిబెటన్ ఇసుక ప్లవర్ పక్షిని కనుగొన్నారు. వికారాబాద్ జిల్లా యెంకటాల వద్ద మరో పక్షి సాబెల్లిన్ వీటర్ను రాజశేఖర్ ముద్దం గుర్తించారు. నర్సాపూర్‌లో ఏషియన్ బ్రౌన్ ఫ్లై క్యాచర్‌ను ప్రముఖ వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ శ్రీరామ్‌రెడ్డి తన కెమెరాలో బంధించారు. ఇప్పటివరకు 280 పక్షిజాతులు తెలంగాణకు వలస వచ్చినట్టు తెలిపారు. ఈ పక్షులు చలికాలంలోనే వలస వస్తాయని, తర్వాత స్వస్థలాలకు చేరుకుంటాయని చెప్పారు.