పెగడపల్లి, అక్టోబర్ 22: పొట్టచేతపట్టుకొని ఇరాక్ వెళ్లిన వ్యక్తి.. తిరిగి ఇంటికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్న కొద్ది గంటల్లోనే గుండెపోటుతో మృతిచెందడం జగిత్యాల జిల్లా పెగడపల్లిలో విషాదాన్ని నింపింది. పెగడపల్లికి చెందిన నిమ్మని రమేశ్ (55) జీవనోపాధి కోసం ఏడాది క్రితం ఇరాక్ వెళ్లాడు. ఇంటికి వచ్చేందుకు మంగళవారం విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం రమేశ్‌కు గుండెపోటు రాగా, తోటి మిత్రులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. రమేశ్‌కు భార్య లక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు. రమేశ్ మృతదేహం త్వరగా స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.