నల్లబెల్లి, మార్చి 27 : ఆశా వర్కర్లను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చలో హైదరాబాద్ చేపట్టినందుకు అదుపులోకి తీసుకు న్న ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో నెలకొన్నది. వివరాల్లోకి వెళ్తే.. ఆశ కార్యకర్తల వేతనాలు పెంచాలని కోరుతూ శనివారం చలో హైదరాబాద్కు ఆ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. వారు హైదరాబాద్కు వెళ్లకుండా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో 10 మంది ఆశావర్కర్లను ఎస్సై గోవర్దన్ అదుపులోకి తీసుకున్నారు.
ఊరూరా తిరుగుతూ ఇంట్లో నిద్రిస్తున్న వీరిని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళలనే కనికరం లేకుండా రాత్రి 10 దాటినా ఠాణాలోనే బందీలుగా ఉంచడంపై టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మండిపడ్డారు. అరెస్టయిన వారిలో శ్రీలత, రమాదేవి, నిర్మల, ప్రియదర్శిని, పుష్ప, సుకన్య, అనిత, రఘుసాల ప్రేమలత, చల్ల శోభ, మామిండ్ల జయ ఉన్నారు.