హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన పంపిణీ విషయంలో పాఠశాల విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. సర్కారు బడుల్లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని గురువారం ఆదేశాలిచ్చింది. ఇది సర్కారు బడుల్లో సెంటర్లు ఉన్న చోటనే వర్తిస్తుంది. ఈ సెంటర్లలో ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడాల్లేకుండా పరీక్ష పూర్తయిన తర్వాత మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించింది. అయితే పరీక్షలకు ముందే ఈ నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం వరకు నాలుగు పరీక్షలు అయిపోయాయి. మరో మూడు పరీక్షలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని మైనర్ సబ్జెక్టులకు సైతం పరీక్షలు జరుగుతాయి.
హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 26 వేల స్కూళ్లు, వెయ్యికిపైగా గురుకుల పాఠశాలలను కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసిందని టీపీటీఎఫ్ ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఇంటర్నేషనల్ స్కూళ్లకు కేటాయించిన బడ్జెట్లో సగం సర్కారు స్కూళ్లకిస్తే బడులు బాగుపడతాయని పేర్కొంది. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో టీపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనిల్‌కుమార్, తిరుపతి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.