హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రూ.10వేల వేతనం చెల్లిస్తామని, తీరా అధికారంలోకి వచ్చాక దగా చేయడం, 11 నెలలుగా బిల్లులు మంజూరు చేయకపోవడంతో కార్మికులు కదంతొక్కారు. మాకు నెలకు రూ.10 వేలు ఎప్పుడిస్తరని ప్రశ్నించారు. మ్యానిఫెస్టోలో పెట్టిన విషయం మరిచారా..? అంటూ సర్కారును నిలదీశారు. నెలకు రెండు, మూడు వేలతో ఎట్లా పనిచేయాలే అంటూ మండిపడ్డారు. తెచ్చిన అప్పులు, అప్పులకు మిత్తీలు కట్టలేకపోతున్నామని కంటతడిపెట్టారు. మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
పలు జిల్లాల నుంచి కార్మికులు భారీగా తరలివచ్చారు. జీతాలు, పెండింగ్ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. రోడ్డుపై బైటాయించిన కార్మికులను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ అభిప్రాయాలు వ్యక్తంచేశారు. ఓ కార్మికురాలు మాట్లాడుతూ.. ‘మేం అరవై, డెబ్బయ్ ఏండ్ల వయస్సులోనూ పిల్లలకు వండిపెడుతున్నం. చిన్నపాటి జీవితాలు మావి. 10-11 నెలల నుంచి బిల్లులు రావడంలేదు.
సంవత్సరం నుంచి గుడ్ల పైసల్లేవు. అప్పలు తెచ్చి అన్నం పెట్టినం. అప్పులు తీర్చకపోవడంతో మా పిల్లలు మమ్మల్ని ఇండ్లళ్లకు రానిస్తలేరు. ఈ కాంగ్రెసోళ్లను దేనితో కొట్టినా తప్పులేదు. మమ్మల్ని అరెస్టు చేసినా సరే మాకు జీతాలిచ్చే వరకు కదిలేది లేదు’ అని వాపోయింది. ‘ఎండల, వానల పొగకు ఎన్నోఏండ్లు బాధలు పడ్డాం. ఇంకెంతకాలం పడాలే. రూ.3 వేలు ఇస్తామన్నరు ఇయ్యలేదు. గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నరు ఇవ్వలేదు. అన్నంలో ఒక పురుగు వస్తే పిల్లలు సార్ల దగ్గరిపోయి ఫిర్యాదు చేస్తున్నరు. సార్లు అడుగుడే. ఊరోళ్లు వచ్చి అడుగుడే. మేం ఎంత మందికని సమాధానం చెప్పాలే’ అని మరో కార్మికురాలు ఆవేదన వ్యక్తంచేసింది.
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్తుండగా వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్రకార్యదర్శి జాన్వెస్లీ తీవ్రంగా ఖండిచారు. కార్మికులకు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసిన సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రమను నిర్బంధించడాన్ని ఆయన తప్పుపట్టారు. కార్మికులకు 10 నెలల వేతన బకాయిలు, ఆరు నెలల కోడిగుడ్ల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల నిరాహార దీక్షలు, నిరవధిక సమ్మె నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అప్రమత్తమైంది. మధ్యాహ్న భోజన ఏజెన్సీలతో సమావేశం ఏర్పాటుచేసి, చర్చలు జరపాలని డీఈవోలను ఆదేశించింది. సమ్మె విరమించని పక్షంలో వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైర్టెక్టర్ నవీన్ నికోలస్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో అంతరాయం తలెత్తకుండా చూడాలని సూచించారు.