హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాల పెంపుతో రాష్ట్రవాప్తంగా 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరనున్నదని, ప్రభుత్వంపై ఏడాదికి రూ.108.4 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. రాజేంద్రనగర్లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో శనివారం నిర్వహించిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో సబిత ప్రసంగించారు. ఇక నుంచి ఏటా స్టేట్ లెవెల్ అచీవ్మెంట్ సర్వే నిర్వహించనున్నామని, తొలిమెట్టు వార్షిక ప్రణాళిక విడుదల చేయనున్నామని చెప్పారు. ‘మనఊరు-మనబడి’లో కోటి కన్నా అధికంగా ఖర్చయ్యే పనులను ఎస్ఎంసీలకు అప్పగించాలని తెలిపారు. వారంలో విద్యార్థులందరికీ యూనిఫామ్స్ అందజేయకపోతే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు.