హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : మధ్యాహ్న భోజన పథకం లోపాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)స్పందించింది. నమస్తే తెలంగాణలో మెయిన్‌లో బుధవారం ‘కడుపునిండా బువ్వపెడ్తలేరు’ శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై జూలై 28లోగా నివేదికను సమర్పించాలని విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలుకావడంలేదని ఇటీవలే విడుదలైన మధ్యాహ్న భోజన పథకం సోషల్ ఆడిట్ నివేదిక-2024 వెల్లడించింది. 18 శాతం స్కూళ్లలో పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టడంలేదని ఈ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది. పలు పాఠశాలల్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వడంలేదని, సర్కారు బడుల్లో సురక్షిత తాగునీరు కరువైందని కథనాన్ని ప్రచురించింది.