హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకం ధరల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిరుడు నవంబర్లో వంట చార్జీలు పెంచుతూ ఉత్తర్వులివ్వగా.. ఏడాదిపాటు చోద్యం చూసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా జీవో ఇచ్చింది. రాష్ట్రంలో 2023 జనవరిలో బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన చార్జీలను పెంచింది. ఆ తర్వాత కేంద్రం 2024 నవంబర్లో, 2025 మేలో చార్జీలను పెంచింది. అందుకు తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెంచలేదు.
మలివిడత పెంపు మళ్లెప్పుడో!
మధ్యాహ్న భోజన చార్జీలను ఈ ఏడాది మేలో కేంద్రం మరోసారి పెంచింది. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి అందించే చార్జీలను రూ. 6.19 నుంచి రూ.6.78కు.. ప్రాథమికోన్నత తరగతుల్లో విద్యార్థి చార్జీలను రూ.9.29 నుంచి రూ.10.17లకు పెంచింది. ప్రాథమిక తరగతుల్లో ఒక్కో విద్యార్థికి రూ. 4.07, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి రూ. 6.10 చొప్పన తమ వాటాగా కేంద్రం ఇస్తామన్నది. ఈ చార్జీలను రాష్ట్రంలో పెంచకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే అదనపు వాటాను రాష్ట్రం కోల్పోతున్నది. చార్జీలను పెంచితే వంట కార్మికులకు ఉపశమనం కలిగేది. విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందేది. కానీ సర్కారు చార్జీలను పెంచకపోవడంతో విద్యార్థులు, వంట కార్మికులు నష్టపోయారు. మరీ ఇప్పుడు పెంచాల్సిన చార్జీలను ఎప్పుడు పెంచుతారన్న ప్రశ్నలొస్తున్నాయి. వీటిని పెంచేందుకు మరో ఏడాది పట్టే అవకాశముందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మధ్యాహ్న భోజనం చార్జీల పెంపు ఇలా..