Microsoft | ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నది. ఏఐ రంగంలో కొత్తగా రూ.15వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో 1.2లక్షల మందికి ఏఐలో శిక్షణ ఇచ్చేందుకు మూడు కొత్త కార్యక్రమాలను ప్రారంభించనున్నది.
అడ్వాంటేజ్ తెలంగాణ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ కోర్సును పరిచయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఏఐ ఫౌండేషన్స్ అకాడమీ ప్రారంభించనున్నది. దాంతో దాదాపు 50వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఏఐ ఇండస్ట్రీ ప్రో పేరుతో మరో కార్యక్రమాన్ని చేపడుతుంది. 20వేల మంది నిపుణులకు నైపుణ్యాభివృద్ధి కోసం శిక్షన ఇస్తుంది. ఏఐ-సీఓఈని ఏర్పాటు చేసి ఏఐ గవర్న్ ఇనిషియేటివ్ పేరుతో 50వేల మంది అధికారులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టివిటీ తదితర కీలక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నది. అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్లలో పెట్టుబడులు రెట్టింపు చేస్తామని ప్రకటించింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌కు మధ్య విడదీయలేని సుదీర్ఘ అనుబంధం ఉందన్నారు. హైదరాబాద్‌లో కొత్త ఫెసిలిటీని ప్రారంభించడం మనందరికీ గర్వకారణమన్నారు. హైదరాబాద్‌తో కలిసి చేస్తున్న ప్రయాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందన్నారు. హైదరాబాద్ నేడు ప్రపంచంలోనే టెక్నాలజీ పవర్ హౌస్‌గా, సరికొత్త ఆవిష్కరణలకు, ప్రపంచ ప్రతిభను ఆకర్షించే నగరంగా మారిందన్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుందని.. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.