హైదరాబాద్, సెప్టెంబర్05(నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖ పరిధిలో అత్యంత నష్టదాయకమైనది ఉన్నదంటే అది మైక్రో బ్రూవరీ వ్యాపారమేనని అనుభవంలోకి వచ్చింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులను ముగ్గులోకి దించాలని యోచిస్తున్నది. ఖజానాను నింపుకునేందుకు గల్లీగల్లీలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అత్యంత ఉత్సాహం చూపుతున్నది. ఔత్సాహిక వ్యాపారులు మాత్రం ఆచితూచి అడుగులేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 18 మైక్రో బ్రూవరీలకు అనుమతులు ఉన్నాయి.
ఇందులో ఒక్కటి, రెండు మినహామిస్తే మిగతావన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగే వచ్చే పరిస్థితి లేదని వాటి వ్యాపారులు అంటున్నారు. తొందరపడి ఎవరూ కూడా ఇందులో పెట్టుబడులు పెట్టొద్దని, తాము నిలువెల్లా మునిగిపోయామని హెచ్చరిస్తున్నారు. రాబడి లేక యంత్రాలు అమ్ముకొని ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ ట్యాక్స్ చెల్లిస్తున్నామని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల కారణంగా ఈ తాజా బీరుకు డిమాండ్ లేదని వ్యాపారులు చెప్తున్నారు. నైట్లైఫ్ ఎక్కువగా ఉన్నచోటే దీనికి డిమాండ్ ఉంటుందని నిరూపితమైంది.
గత రెండేండ్లుగా హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడం, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కోతలు, ఆర్థికమాంద్యం తదితర కారణాలతో యువతలో ఖర్చు చేసే సామర్థ్యం కూడా తగ్గిపోయింది. ప్రధానంగా ఐటీ రంగంలో భారీ కుదుపు రావడం కూడా నైట్లైఫ్ తగ్గిపోయిందని చెస్తున్నారు. ఐదేండ్ల కిందటి వరకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో నైట్లైఫ్ ఎక్కువగా ఉండేది. పబ్బులు, బార్లు కస్టమర్లతో సందడిగా ఉండేవి. దీంతో ఈ ప్రాం తంలో 8 మైక్రో బ్రూవరీలు పెట్టారు. ప్రస్తుతం ఇందులో కేవలం ఒక్క మైక్రోబ్రూవరీ మాత్రం లాభనష్టాలతో పనిలేకుండా నడుస్తుండగా, మిగతావి 50 శాతం నష్టాల్లో ఉన్నట్టు ఎక్సైజ్ నివేదికలే చెప్తున్నాయి.
ఇన్నాళ్లూ రాష్ట్ర రాజధానికే పరిమితమైన మైక్రో బ్రూవరీలు త్వరలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తూ రేవంత్రెడ్డి సర్కారు ఈ మేరకు ఉత్తర్వులను జారీచేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 16 కార్పొరేషన్ల పరిధిలో మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఇన్స్టాంట్ కాఫీ తరహాలో అప్పటికప్పుడు తాజా బీరును తయారు చేసి అకడికకడే విక్రయించే యూనిట్లను మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది. ఆస్తకి ఉన్నవారు సెప్టెంబర్ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ సూచించింది. అనుమతి పొందినవారు 180 రోజుల వ్యవధిలో మైక్రో బ్రూవరీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నొటిఫికేషన్లో పేర్కొన్నది.
మైక్రో బ్రూవరీ ఏర్పాటు కోసం దరఖాస్తు ఫారం ధర రూ.1 లక్ష, బ్రూవరీ ఫీజు రూ.5 లక్షలే అయినా యంత్రాల ఖర్చు కోట్లల్లో ఉంటుంది. అనుమతి పొందిన తర్వాతే వ్యాపారికి అసలు వ్యవహారం మొదలవుతుంది. మైక్రోబ్రూవరీ, వినియోగ స్థలం కలిసి కనీసం 1,000 గజాలు అవసరం. అది కూడా ప్రైమ్ ఏరియాలోనే ఉండాలి కాబట్టి, బిలియనీర్లు తప్ప సాధారణ వ్యాపారులు ఇంత విలువైన స్థలాన్ని కొనలేరు. స్థలాన్ని లీజుకు తీసుకోవాల్సి వచ్చిన దానికీ ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో 1,000 గజాల ఖాళీ స్థలానికి కనీసం నెలకు రూ.5 లక్షలు ఉంటుంది. ఇందులో మిషనరీ ఏర్పాటుకు బల్క్ లీటర్ల కెపాసిటీని బట్టి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చవుతుంది.
మైక్రోబ్రూవరీని మూడు శ్లాబులుగా విభజించారు. ఇందులో రోజుకు 250 బల్క్ లీటర్ల బీరు కెపాసిటీ బ్రూవరీ, 500 బల్క్ లీటర్లు, 1,000 బల్క్ లీటర్ల చొప్పున శ్లాబులుగా విభజించారు. రోజుకు ఎంత బీరు విక్రయిస్తారో ముందుగానే నిర్ణయించుకొని ఆ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి సదరు వ్యాపారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి బల్క్ లీటర్ బీ రుకు రూ.28 ఎక్సైజ్ డ్యూటీ, దీనిపై 70శాతం వ్యాట్ ట్యాక్స్ అంటే రూ.20 మొత్తం కలిపి రూ.48ని రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి. అనుమతి తీసుకున్న శ్లాబ్ మేరకు బీరు విక్రయించినా, విక్రయించకపోయినా ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ ట్యాక్స్ మాత్రం చెల్లించాల్సిందే.
జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ మైక్రోబ్రూవరీలో 500 బల్క్ లీటర్ల బీరు ఉత్పత్తి, విక్రయానికి గతంలో అనుమతి తీసుకున్నారు. కానీ ఇక్కడ 100 బల్క్ లీటర్లకు మించి ఏ ఒక్కరోజూ అమ్ముడుపోలేదు. కానీ ఆ వ్యాపారి మాత్రం రోజుకు 500 బల్క్ లీటర్లకు ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ చెల్లించాల్సి వచ్చింది. 500 లీటర్ల మేర రోజుకు రూ.24,000 చొప్పున నెలకు రూ.7.20 లక్షలను ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ రూపంలో చెల్లించాల్సి వచ్చింది. దీంతో వ్యాపారం దివాలా తీసిందని, ప్రస్తుతం మిషనరీ, లైసెన్స్ అతి తక్కువ ధరకు విక్రయించినట్టు ఆ బ్రూవరీ వాటాదారుడు నమస్తే తెలంగాణకు వివరించారు. ఈ దెబ్బతో హైదరాబాద్లోని 18 మైక్రోబ్రూవరీల్లో ఒకటి, రెండు మాత్రమే లాభాల్లో ఉండగా, మిగతావన్నీ నష్టాల్లో ఉన్నాయని తేలింది. ధనవంతులకే ఈ వ్యాపారం సరిపోతుందని వివరించారు. ఔత్సాహికులు వ్యాపారంలోకి వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు వివరాలు తెలుసుకొని వ్యాపారంలోకి దిగాలని పలువురు సూచిస్తున్నారు.